Friday, 7 July 2017

చికీర్ష

చికీర్ష- 
అంటే చేయాలనే కోరిక. ఏవేవో చేసేయాలని చిన్నతనంలో అంతా అనుకుంటారు. నేనూ అనుకున్నాను. కొన్ని చేయగలిగాను. కొన్ని చేయలేనని తెలుసుకున్నాను. కొన్ని చేయకూడదని మానేశాను. కొన్ని వదిలేశాననుకుని పట్టుకున్నాను. కొన్ని పట్టుకున్నా అందనివి విడిచిపోతుంటే చేయూపి వీడుకోలు పలికాను. అటువంటి కొన్నింటిలో ఇప్పుడు చేయగలిగినవి కొన్ని ఎంచుకుని ఇక్కడ పొందు పరచాలనే తపన. చాలాకాలంగా చేస్తున్న కొన్నింటిని సమాహారం చేసి ఇక్కడ పంచుకోవాలని ఆలోచన. అవేమేంటో వాటికే వదిలేశాను. ఏవి చేయాలనుకున్నానో అవి చేసేదాక చేయగలనని, చేశానని కూడా తెలియదు.
    నెట్ వచ్చాక ఇదొక సౌకర్యం, సౌలభ్యం. భావాలు పంచుకోవటం సుగమమైంది. చూద్దాం. ఈ చికీర్షువు ఏమేమం ఆవిష్కరిస్తుందో.
      ఇప్పటికి ఇందులో రెండు రకాల వస్తువులున్నాయి-
ఒకటి - అనువదింపబడిన ఉర్దూ షేర్ లు, 
రెండు- నా హిందీ లేఖనాలు
--------------------
116 షేర్ల సంకలన సరణి--ఒక పరిచయం--

జల్లులలో తడిసే ముందు...
          సంతోషం, బాధ, కోపం, జాలి, అనుతాపం, నిరాశ, ఆశ, చిరాకు... ఇటువంటి చాలా భావాల సమ్మేళనమే జీవితం. కొందరు అనుకున్నట్టు నా జీవితం, నీ జీవితం అని వంద రకాలుండదు. జీవితం అంటే అందరికీ శరీరపరంగా మనసుపరంగా ఒకటే అనుభవం. బాధొస్తే ఏడుపు, సంతోషమొస్తే ఉప్పొంగే హృదయం సహజంగా అందరికీ ఉంటాయి. అయితే పరిమాణాల తేడా ఉంటుంది. ఇంక వ్యక్తం చేయటంలో తేడాలు ఉంటాయి. కొందరు లోలోపలే అనుభూతి చెందుతారు, కొందరు బయటకు వ్యక్తం చేస్తారు.
           అట్లా హృదయం స్ఫుటంగా అనుభూతి చెందుతున్నా చాలాసార్లు మాటల్లో ప్రకటించలేకపోతాము. చెప్పలేనివెన్నో మంచి, చెడు భావాలు లోలోపల నలుగుతుంటాయి..! పరస్పరం వ్యక్తులు మౌనంతో చెప్పుకోవటం ద్వారా తీరేవి కొన్ని. ఎదురుగా ఉన్నా చెప్పుకోలేనివి, వ్యక్తపరచినా అర్థం కానివి కొన్ని. కారణాలు అనంతం. సామన్యులందరి బాధా అంతే. హృదయానికి వ్యక్తంచేసే చేయి, దానిలో ఓ కలం ఉంటే బాగుండు; చేతికి స్పందన అంటే ఏంటో తెలిస్తే బాగుండు’- అని కొట్టుకోవటమే తప్ప మనమేమీ చేయలేము.
           అయితే దాదాపు అటువంటి భావాలను కూడా కలంబద్ధం చేయటం కవులకే సాధ్యం. మనం చెప్పలేనివి వారు చెప్తారు. తమకోసం చెప్తున్నామనుకోని అందరికోసం చెప్తారు. విశ్వాత్మకమైన భావాలే ఇవన్నీ. ప్రతి భాషలో కవులుంటారు. ప్రతి కాలంలో ప్రతి దేశంలో ప్రతి సందర్భంలో ఉంటారు. వారి పని ఇదే. ఏ భాషైతే ఏఁ..? ఏ దేశమైతే, కాలమైతే ఏఁ? కొన్ని మానవానుభవాలు మారవు. ప్రేమ, పెళ్ళి, ద్వేషం, విరహం, పేగుబంధాలు, వివాహాలు, చావులు, డబ్బు సమస్యలు, రోగాలు, విభేదాలు, స్నేహానుబంధాలు, వెన్నుపోట్లు, నమ్మకద్రోహాలు, దేశదర్మాల కోసం ప్రాణాలర్పించటాలు, స్వార్థాలు, త్యాగాలు- ఇట్లాంటివి ఇంకా చాలా కూడా ప్రతి సమాజంలోను, ప్రతి కాలంలోను ఉన్నాయి. అందుకే వాటిని గురించి వ్రాసిన అక్షరాలు దేశకాలాదుల ఎల్లలు దాటి అనంతంగా అందరి హృదయాంతరాలాలోకి చొచ్చుకుపోగల సమర్థత కలిగి ఉంటాయి.
           నాకు కవిత్వమంటే ప్రాణం, చిన్నతనం నుంచే..! ఆ రసానందం నాకు ప్రాణం పోసిన సందర్భాలెన్నో! మనసు వసివాడే వేళ, ఆశలు చెదిరిన వేళ, బాసలు చెరిగిన వేళ, ఈ కావ్యలేపనాన్ని  గుండెకు పూసుకుని ఉపశమనం పొందిన సందర్భాలెన్నో! అది సహజమైన ఆర్ద్రత ఇచ్చిన వరం. ఆ కవి పడిన వేదన తాలూకు గుండె చప్పుడు జాలువార్చిన అక్షరాలు, ఈ పఠిత హృదయాన్ని తాకి గుండెగాయాన్ని మాపి, దాని స్పందనను లయబద్ధం చేస్తుంది. అందులో ఆశ్చర్యమేమీ లేదు. భావగాయానికి భావలేపనమే మందు.
          నేను భాషాభిమానిని. భాషే నా పని, నా హృదయం స్పందింపచేసే కార్యశీలమైన శక్తి. అయితే భాషను సామాన్యంగా ప్రేమించే నాకు నాకు ఉర్దూ అంటే భాషా-సంస్కృతుల పరంగా పెద్దగా అభిమానం లేదు. కానీ అందులో షాయరీలంటే చాలా ప్రాణం. ఓసారి కర్కశంగా, మరోసారి పుల్లవిరుపుగా, ఇంకోసారి సన్నని గాలి తెరలా.. సన్నగా, చిన్నగా, ముగ్ధంగా, కోమలంగా ఉంటూ పెద్ద పెద్ద జీవన సత్యాలను, మానవ అంతరంగాన్ని అలతి పదాలతో ఆవిష్కరించే వారి తీరు నాకు నచ్చుతుంది...
          చిన్నతనంలో షాయరీ పుస్తకాలే తెచ్చి చదివేదాన్ని. పత్రికలలో వస్తే ఆవురావురుమని చదివేదాన్ని. ఏవైనా ఎవరైనా రచయితలు సాందర్భికంగా వాటిని ప్రస్తావిస్తే చదివి వాహ్ వాహ్ అనుకునేదాన్ని. ఇంటర్నెట్ వచ్చాక అప్పుడప్పుడు అట్లా షాయరీల సైట్లు తిరగేసేదాన్ని. ఇక అసలు కథలో పడ్డాక కొన్ని చెరిగిపోయాయి. కొన్నింటిని నేనే చెరిపేశాను.. తరువాత వాట్సాప్ వచ్చింది. వచ్చాక అన్నింటితో పాటు ఇవీ ప్రవహించాయి. నేను మరోసారి వాటి ఆత్మీయమైన వానజల్లులో తడిశాను. మనం ఒక్కరమే తడవటం కాదు, అని ఇతరుల పైకి ఆ చిందులు కొన్ని చల్లాను. నా కలానికి ఆ వానజల్లులు కురిపించటం రాదు. చినుకులు నావి కాకపోతేనేమి, మబ్బులు కురిసిన జల్లులే కదా.. అని, సత్యసనాతనభారతి అని మా వాట్సాప్ సదస్సులో నా వారి పైకి వాటిని చిందించాను. కానీ వారెవ్వరూ తడిసినట్టు లేరు. ఏ స్పందనా వచ్చేది కాదు. ఎందుకంటే భాష ఆటంకం. ఎవ్వరికీ ఏమీ అర్థమయ్యేది కాదు. అందుకని తడవటానికి అడ్డంవచ్చిన ఆ అద్దాల మేడను తెలుగు అనువాదాలతో బద్దలు కొట్టేశాను. వెంటనే జల్లులు అంతటా కురిశాయి. చాలా స్పందించారు. బాగున్నవన్నారు. ప్రోత్సహించారు.
          సరే, అట్లా పంపుతూ నా అలవాటు ప్రకారం ఫైల్ చేసి ఉంచాను. ఇవాళెందుకో ఎన్నైనాయా అని చూస్తే 116 తేలాయి. అమ్మో.. అని నాకు నేనే దిష్టి పెట్టేసుకుని, తేరుకుని వెంటనే వాటిని బ్లాగ్ చేశాను. చదివి, మీ స్పందనలు తెలియచేయగలరు. (భాషమాత్రమే నాది, భావాలలో అక్షరం కూడా నాది కాదు. చప్పుడు మాత్రమే నాది, హృదయం నాది కాదు.) ఆ జల్లులలో మీరూ తడుస్తూ, ఆనందిస్తారని ఆశిస్తూ..
--ఉషారాణి


No comments:

Post a Comment